గుడ్డివాడివైతే మాకేంటి.. ఇవన్నీ అవసరమా?

న్యూఢిల్లీ : 'నూతన విద్యావిధానం పేరిట దేశంలోని వివిధ కాలేజీల్లో ఫీజుల పెంపుపై 22 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిన్న శాంతియుతంగా పార్లమెంటును ముట్టడించేందుకు సిద్ధమయ్యాం. అయితే పోలీసులు మా పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జోర్ భాగ్‌లో మాపై లాఠీలతో విరుచుకుపడ్డారు. మేమంతా పారిపోయేందుకు ప్రయత్నించాం. అయితే ఓ పోలీసు నన్ను పట్టుకుని కొడుతుంటే.. నా సహ విద్యార్థులు మానవహారంగా నిలబడి నన్ను రక్షించాలని భావించారు. నేను అంధుడినని వారికి చెప్పారు. అయినా అతడు వినకుండా వాళ్లందరినీ చెదరగొట్టి నన్ను కొట్టాడు. గుడ్డివాడు అయితే నిరసనల్లో పాల్గొనడం ఎందుకు హేళన చేస్తూ ఇష్టారీతిన లాఠీచార్జీ చేశాడు. ఆ తర్వాత మరికొంత మంది పోలీసులు వచ్చి నన్ను కొట్టారు. నా గుండెలపై, పొట్టపై, గొంతు మీద బూట్లతో తొక్కుతూ హింసించారు. ఎత్తి కిందపడేశారు. పారిపో అని చెప్పారు. దీంతో ఎలాగోలా శక్తి కూడదీసుకుని పరిగెడుతుంటే వెనుక నుంచి కాళ్లపై కొడుతూ మళ్లీ కిందపడేశారు' అంటూ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అంధ విద్యార్థి శశి భూషణ్‌ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.