బెల్టు తీయాల్సిందే!

'కంచె.. చేను మేసిన రీతి'గా.. జిల్లాలో కొందరు ఆబ్కారీ అధికారుల అండదండలతో అడ్డగోలుగా బెల్ట్‌ షాపులను నడుపుతున్నారు. నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నా.. వీరికి మాత్రం అవి వర్తించవన్నట్లుగా ఈ తతంగం సాగుతుంది. దీంతో గ్రామాలు మద్యం మత్తులో జోగుతున్నాయి. ఇటీవల కొత్త మద్యం దుకాణాలకు లైసెన్స్‌లు కట్టబెట్టడంతో కొత్తగా బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసుకునే పని ఊపందుకుంది. , మహబూబ్‌నగర్‌ : నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. జిల్లాలో మొత్తం 67 మద్యం దుకాణాలున్నాయి. ఇటీవల వీటన్నింటికి కొత్తగా లైసెన్సులు జారీ చేశారు. మరో రెండేళ్ల పాటు వీరే దుకాణాలను నడిపించనున్నారు. దుకాణాలతో పాటు అనధికారికంగా దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా అనధికారికంగా బెల్టు దుకాణాలు సుమారు 350పైబడి ఉన్నట్లు సమాచారం. అత్యధికంగా నవాబ్‌పేట, దేవరకద్ర, జడ్చర్ల ప్రాంతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి అధికారిక దుకాణాల కంటే రెండింతలు అధికంగా ఈ దుకాణాలున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో రోజుకి రూ.3.50కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. కేవలం అనుమతుల్లేని దుకాణాల ద్వారానే రూ.30 లక్షల నుంచి రూ.40లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. పలు బెల్టు దుకాణాల్లో రోజుకి రూ.50వేల మద్యం అమ్ముడవుతోంది. వీటిల్లో పగలు, రాత్రిళ్లు మద్యం విక్రయాలు జరుగుతుండడంతో యువత మద్యానికి బానిసవుతున్నారు.